సూర్యాపేట: తమ నాయకుడికి వైస్ చైర్మన్ పదవి దక్కలేదన్న బాధతో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణం ఐదో వార్డు నుంచి స్థానిక టీఆర్‌ఎస్ నేత బాషా భాయ్ గెలుపొందారు. సూర్యాపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ వశం కావడంతో ఆయనకు వైస్ చైర్మన్ పదవి వస్తుందని భావించారు. అయితే, చివరి నిమిషంలో బాషాకు పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరుడైన యువకుడొకరు ఇంట్లోకి వెళ్లి ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం