ఇంట్లో కరోనా కుంపటి

 సిటీబ్యూరో: ఇంట్లోని ఇల్లాలుకు లాక్‌డౌన్‌ కష్టాలను తెచ్చిపెడుతోంది. కుటుంబ వివాదాలకు హేతువుగా మారుతోంది. గృహహింసకు తావిస్తోంది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్, రాచకొండ పోలీసులకు డయల్‌ 100, ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా సుమారు 459 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదు లను తీవ్రంగా పరిగణించిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌  ఆయా ఠాణాల అధికారులతో భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మాట వినకపోతే కేసులు నమోదు చేస్తున్నారు.




ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ కొడుతున్నారని, కర్రీ సరిగా వండలేదని, టీవీ ప్రోగ్రామ్‌ల విషయంలో గొడవలు, సెల్‌ఫోన్‌ వినియోగంలోనూ ఘర్షణ, కట్నం తేవాలంటూ కొట్లాట, డ్యూటీ చేయట్లేదు కదా నీకు తిండి పెట్టడం దండగ అని ఇంట్లో ఉంటున్న భర్తలు హింసిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా లాక్‌డౌన్‌ వేళ 4590 ఫిర్యాదులు వచ్చాయని షీ బృందాలు చెబుతున్నాయి. ఇవి చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నా చాలా మంది కుటుంబాల్లో మనస్పర్థలకు దారి తీస్తున్నాయని, చిన్న పిల్లలపై కూడా ప్రభావం చూపుతున్నాయని ఫ్యామిలీ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న కౌన్సెలర్లు అంటున్నారు. అందుకే ఎవరి నుంచైనా ఫిర్యాదు రాగానే ఆయా కుటుంబాలను పిలిపించి వారికి నచ్చచెబుతున్నామని, ఆయన తీరు మారకపోతే కేసుల వరకు వెళుతున్నాయని పేర్కొన్నారు.